Chandrababu: ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాం 6 d ago

AP : సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, టూరిజం అభివృద్ధిపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తూ, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజల కోసం చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు, మగ్గాలకు ఉచిత విద్యుత్, మత్స్యకారులకు 217జీఓ రద్దు, గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇలా ఎన్నో హామీలను ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ప్రజల నుంచి 8 లక్షల 26 వేల ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇందులో రీ సర్వేకు సంబంధించి 2,59,642 ఫిర్యాదులు, ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 2,34,944 ఫిర్యాదులు, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం ద్వారా 1,19,494 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని, ఈ హబ్ ద్వారా కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూవర్‌ని తయారు చేయడమే లక్ష్యమన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఇండస్ట్రియల్ పాలసీలు రూపొందిస్తామని తెలిపారు. పీ - 4లో భాగంగా సమాజంలో అట్టడుగున ఉన్న పేదలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకొస్తామని.. డ్వాక్రా, మహిళా సంఘాల ద్వారా పేదలను గుర్తించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.